తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల గురుకుల విద్యాసంస్థల ప్రవేశాల్లో స్థానిక నియోజకవర్గాల్లో ఉన్న విద్యార్థులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇకనుంచి ఏ నియోజకవర్గానికి చెందిన విద్యార్థులకు ఆ నియోజకవర్గ పరిధిలోని గురుకులాల్లోనే ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది.
మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకొన్నారు. గురుకులాల నిర్వహణలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యంచేయాలని క్యాబినెట్ తీర్మానించింది. ఇప్పటిదాకా గురుకులాల నిర్వహణ అధికారుల పర్యవేక్షణలోనే సాగుతున్నది. ఇకపై ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లో ప్రతినెలా నిర్వహించే సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లను విధిగా ఆహ్వానించాలని ఆదేశించింది. దీంతో గురుకులాల్లో ఉత్పన్నమయ్యే సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ప్రజాప్రతినిధులు కృషిచేసి మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిర్ణయం దోహదపడుతుంది.
ప్రస్తుతం రెసిడెన్షియల్ విద్యాలయాల ప్రవేశాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి రాతపరీక్ష ద్వారా ఎంపికచేసి.. కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాలోనైనా ప్రవేశం కల్పించాల్సివస్తున్నది. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులకు వ్యయ ప్రయాసలు, దూరాభారంతో కూడుకొన్నదవుతున్నది. ఈ పరిస్థితిని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాల్లో స్థానిక రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకొన్నారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలకు చెందిన మొత్తం గురుకుల పాఠశాలలు, కళాశాలలు 959 ఉన్నాయి. 2014 వరకు 298 మాత్రమే ఉండేవి, తరువాత సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి ఒక గురుకుల విద్యాలయాన్ని నెలకొల్పాలని నిర్ణయించడంతో ఆయా వర్గాలకు 661 గురుకుల విద్యాసంస్థలు ఏర్పడ్డాయి. దేశంలో ఐఐటీ, ఐఐఎం, మెడికల్ వంటి ప్రతిష్ఠాత్మక కోర్సుల్లో ప్రవేశాలు పొందే గురుకుల విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో వీటిల్లో చదవాలనే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం లక్షలమంది విద్యార్థులకు మేలు కలిగిస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.