తెలంగాణ రాష్ర్టానికి పెట్టుబడుల వరద కొనసాగుతున్నది. దేశ,విదేశీ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రభుత్వరంగ మహారత్న కంపెనీ భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) కొత్త ప్రాజెక్టుతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మంగళవారం ముందుకొచ్చింది.
రూ.1,000 కోట్లతో రాష్ట్రంలో ఇథనాల్ (ఫస్ట్ జనరేషన్) ప్లాంటును ఏర్పాటుచేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 100 ఎకరాల స్థలం, కావాల్సినంత నీరు అందిస్తే ప్లాంటు ఏర్పాటుచేస్తామని తెలిపింది.
ప్లాంటు ఏర్పాటుకోసం బీపీసీఎల్ గతంలోనే రాష్ట్ర పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసింది. తాజాగా మంగళవారం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (బయో ఫ్యూయల్స్) అనురాగ్ సరోగి, ఈడీ (ఇంజినీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్) ఎల్‌ఆర్ జైన్, కృష్ణపట్నం-హైదరాబాద్ పైప్‌లైన్ ప్రాజెక్టు లీడర్ బీ మనోహర్ నేతృత్వంలోని బృందం పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో సమావేశమైంది.