డయాబెటిక్ పేషెంట్లు ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఏది తినొచ్చో, ఏది తినగూడదో తెలుసుకుని ఆరోగ్యానికి హాని కలుగజేయవు అనుకున్న వాటిని మాత్రమే తమ మెనూలో చేర్చుకుంటారు. అదేవిధంగా కోడిగుడ్డు విషయంలో కూడా షుగర్ పేషెంట్లకు ఎన్నో అనుమానాలు ఉంటాయి. తాము కోడిగుడ్లు తింటే గుండె జబ్బులు వస్తాయని చాలామంది డయాబెటిక్ రోగులు భయపడుతుంటారు. కానీ అందులో వాస్తవం లేదని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.
గుడ్లు తినని వారికంటే గుడ్లు తినే వారిలోనే గుండె వ్యాధుల ముప్పు తక్కువగా ఉన్నదని ఆ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ప్రీ-డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారిలో గుడ్డు వల్ల గుండె సమస్యలు తగ్గినట్లు అధ్యయనకారులు తెలిపారు. ‘సిడ్నీ యూనివర్సిటీ’ పరిశోధకులు జరిపిన ఆ అధ్యయనం ప్రకారం గుడ్డు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదే. ఏడాదిపాటు వారానికి 12 గుడ్ల చొప్పున తినే డయాబెటిక్, టైప్-2 డయాబెటిక్ బాధితులకు గుండె జబ్బుల ముప్పు ఉండదట.