టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ నేడు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారు. కేటీఆర్ చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటారు. కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొంటారు.
ఈ నెల 16న ఎల్ రమణ తన అనుచరులు, టీడీపీ నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో లాంఛనంగా చేరుతారు. ఈ సందర్భంగా తెలంగాణభవన్ లేదా కరీంనగర్‌లో సభ నిర్వహించనున్నట్టు తెలిసింది.ఎల్. రమణ చేరికపై కొంత కాలంగా చర్చలు జరిగాయి. ఈ నెల 7న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు.
తెరాసలో చేరిక, పార్టీలో బాధ్యతలు, రాజకీయ భవిష్యత్‌పై చర్చించారు. ఆ మరుసటిరోజే రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవికి, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఎల్.రమణకు త్వరలో ఎమ్మెల్సీ పదవితో పాటు భవిష్యత్తులో పార్టీ, ప్రభుత్వంలో క్రియాశీలక అవకాశాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.