పదవులన్నీ అనుభవించి తల్లిలాంటి పార్టీని, తండ్రిలాంటి కేసీఆర్‌ను ఈటల రాజేందర్ మోసం చేశాడని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. గరీబోళ్ల భూములను కబ్జా చేసి, ఫిర్యాదులపై విచారణకు ఆదేశించగానే పార్టీ ఫిరాయించారని విమర్శించారు. నల్ల చట్టాలను చేసిన బీజేపీలో చేరి దొంగలతో దోస్తానా చేశాడని నిప్పులు చెరిగారు.
శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి బాల్క సుమన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఈటలను సొంత తమ్ముడిలా చూసుకున్నారని.. ఈటల మాత్రం పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాడని ధ్వజమెత్తారు.
శత్రువులతో చేతులు కలిపి సీఎం కేసీఆర్‌కే వెన్నుపోటు పొడిచేందుకు కుట్ర పన్నాడని ఆరోపించారు. నిన్నటి దాకా బీజేపీని తిట్టిన ఆయన అదే పార్టీలో చేరడం దురదృష్టకరమన్నారు. ఆయన్ను ప్రజలు క్షమించరని, తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.