ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు.. ఏపీతోనే కాదు.. దేవుడితోనైనా కొట్లాడి కృష్ణా నీళ్లు అందిస్తామని రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఉండగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం జరగనివ్వమని తేల్చిచెప్పారు. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదు.. చట్టప్రకారం రావాల్సిన నీటివాటాను సాధించుకుంటాం అని పునరుద్ఘాటించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తాము అని కేటీఆర్ పేర్కొన్నారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల ఐసీయూ వార్డును కేటీఆర్ ప్రారంభించారు. సమీకృత మార్కెట్‌కు, అమరవీరుల స్మారక పార్కుకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ ట్రైనింగ్, టెక్స్‌టైల్ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన చిల్డ్రన్స్, సైన్స్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.