తెలంగాణలో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మొత్తం 157 ఎకరాల్లో భూ సేకరణ పూర్తి చేసి టీఎస్ఐఐసీకి అప్పగించింది. ఇందులో రైస్ మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఏటికేడు పెరుగుతోన్న ధాన్యం దిగుబడులకు అవసరమైన రవాణా, మిల్లింగ్ కష్టాలు తీరనున్నాయి.
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు భూ సేకరణ పూర్తిఖమ్మం జిల్లాకు కేటాయించిన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు కసరత్తు శరవేగంగా సాగుతోంది. అనువైన స్థలం ఎంపిక కోసం రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం.. దాదాపు నెల రోజుల్లోనే రఘునాథపాలెం మండలంలోని చింతగుర్తి, కోయచలక, రఘునాథపాలెం రెవెన్యూ గ్రామాల పరిధిలో మొత్తం 157.04 ఎకరాల భూమిని గుర్తించింది. రఘునాథపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 30, కోయచలకలో 192, చింతగుర్తిలోని 266 సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిని సేకరించి టీఎస్ఐఐసీకి అప్పగించారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో పలు పరిశ్రమల స్థాపన కోసం టీఎస్ఐఐసీ పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. గురువారం వరకు 50 దరఖాస్తులు అందాయి. ఈ నెల 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. స్థల సేకరణ పూర్తయినందున రహదారుల నిర్మాణం, తాగునీటి వసతులు, విద్యుత్ సదుపాయం కల్పించేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సైతం పరిశ్రమల స్థాపన కోసం ఆసక్తి చూపుతుండటంతో కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దిగుబడులకు సరిపడా మిల్లులు లేక అవస్థలు..
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో ఎక్కువగా రైస్ మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో అన్ని రకాల ప్రధాన పంటలు సాగవుతాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ధాన్యం దిగుబడులకు సరిపడా రైస్ మిల్లులు లేకపోవడం వల్ల ఇతర జిల్లాలపై ఆధారపడుతున్నారు. ఈసారి ఖమ్మం జిల్లాలో ఏకంగా 3 లక్షల 61 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయి. కానీ.. జిల్లాలో అందుబాటులో ఉన్న 7 బాయిల్డ్ రైస్ మిల్లుల్లో కేవలం 45 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉంది. మిగిలిన ధాన్యం మిల్లులకు తరలించేందుకు రైతులు అష్టకష్టాలుపడ్డారు.
తొలగనున్న ఇబ్బందులు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. జిల్లాలో కొలువుదీరబోయే ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌తో ధాన్యం సేకరణ తర్వాత ఎదురయ్యే ఇబ్బందులు పూర్తిస్థాయిలో తొలగనున్నాయి. స్థానికంగా అనేక మంది పారిశ్రామిక వేత్తలకు అవకాశం దక్కనుంది. యువతకు ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని అధికారులు చెబుతున్నారు.వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉన్న ఖమ్మానికి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఉపయుక్తంగా ఉంటుంది. రైస్ మిల్లర్లు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు అనేక మంది ఉత్సాహం చూపుతూ ముందుకు వస్తున్నారు.