తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హామీల అమలుకు నిధులు మంజూరయ్యాయి. సిద్దిపేట, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సీఎం కేసీఆర్ ఇటీవల పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు పురపాలికలు, పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీ మేరకు ఇవాళ నిధులు మంజూరు అయ్యాయి.
కామారెడ్డి పురపాలికకు రూ. 50 కోట్లు మంజూరు చేశారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి పురపాలికలకు రూ. 25 కోట్ల చొప్పున, కామారెడ్డి జిల్లాలో 526 పంచాయతీలకు రూ. 10 లక్షల చొప్పున మంజూరు చేశారు.
బెజ్జంకి మండలంలో అభివృద్ధి పనులకు రూ. 20 కోట్లు, భువనగిరి పురపాలికకు రూ. కోటి, మోత్కురు, పోచంపల్లి, ఆలేరు, యాదగిరి గుట్ట, చౌటుప్పల్ పురపాలికలకు రూ. 50 లక్షల చొప్పున, యాదాద్రి భువనగిరి జిల్లాలో 421 పంచాయతీలకు రూ. 25 లక్షల చొప్పున మంజూరు చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి నిధులు మంజూరు చేశారు.