తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో ఇవాళ ప్రారంభించుకున్న బాలానగర్ ఫ్లై ఓవర్‌కు బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్‌గా నామకరణం చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు కేటీఆర్ ఘన నివాళులర్పించారు. బాలానగర్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. బాలానగర్ వాసుల 40 సంవత్సరాల కల నెరవేరింది. ట్రాఫిక్ సమస్యతో బాలానగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రహదారి గుండా వెళ్లేవారికి కనీసం 30 నిమిషాలపాటు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. ఇప్పుడు ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎస్ఆర్డీపీ ( వ్యూహాత్మక రోడ్ల అభివృద్ది ప్రణాళిక) ద్వారా.. ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తున్నాం. కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలో రూ. వెయ్యి కోట్ల పై చిలుకు డబ్బులతో రహదారుల విస్తరణ, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం జరిగింది. హైదరాబాద్ ప్రజలకు మరింత మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థను అందిస్తామన్నారు. రవాణా వ్యవస్థను సులభతరం చేస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సంయుక్తంగా కలిసి బ్రహ్మాండమైన అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. బాలానగర్ పరిధిలో రహదారుల విస్తరణ కూడా చేపడుతామన్నారు. ఫతే నగర్ బ్రిడ్జి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి అని తెలిపారు.
ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు, జూబ్లీ బస్టాండ్ నుంచి తుర్కపల్లి(ఓఆర్ఆర్) దాకా స్కైవేలు నిర్మించేందుకు గత నాలుగేండ్ల నుంచి కసరత్తు జరుగుతోంది అని మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే రక్షణ రంగ సంస్థలకు చెందిన భూములు ఉండటం వల్ల.. కేంద్ర ప్రభుత్వ సహాయక నిరాకరణ వల్ల ఆ పనులు నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఈ రెండు స్కైవేల నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్నారు. కేంద్రం హైదరాబాద్ ప్రజల బాధలను అర్థం చేసుకోలేకపోతోంది అని కేటీఆర్ పేర్కొన్నారు.