సిరిసిల్ల గురించి చెప్పాలంటే 2014కు ముందు.. 2014కు తర్వాత అని రెండుగా విడదీసి చెప్పాలి. అంతకుముందు ఏం ఉంది చెప్పుకోవడానికి అంటే.. ‘ఉరిసిల్ల’ మాత్రమే. అప్పుడు నేతన్నలు ఉరివేసుకొన్నారన్న వార్తలే వచ్చేవి. ఇప్పుడేముంది అంటే.. మరమగ్గాల సవ్వడి, కళకళలాడుతున్న పంటపొలాలు, నిండుకుండల్లా నీటిపారుదల ప్రాజెక్టులు, అందమైన రోడ్లు, కూడళ్లు, అత్యాధునిక దవాఖానలు, అధునాతన గోదాములు, రైతుబజార్లు, హైటెక్ భవనాలు.. ఇలా చెప్పుకుంటూపోతే పెద్ద లిస్టే ఉంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దార్శనికత, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్రాభివృద్ధి సాధిస్తూ అదర్శంగా నిలుస్తున్నది.
ఏడేండ్ల కాలంలోనే జిల్లా ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. జిల్లా నలుమూలల ఎటుచూసినా జళకళ ఉట్టిపడుతున్నది. నీటి పారుదల ప్రాజెక్టుల పనులు తుదిదశకు చేరుకున్నాయి. వీటితో జిల్లాలో దాదాపు రెండున్నర లక్షల పైచిలుకు ఎకరాల్లో రెండు పంటలు పండనున్నాయి. ఇప్పటికే శ్రీ రాజరాజేశ్వర జలాశయంతో జిల్లా వాటర్‌హబ్‌గా మారింది. అన్నపూర్ణ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రూ.1,627 కోట్లతో చేపట్టిన ప్యాకేజీ 9 పనుల ద్వారా శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి ఎగువమానేరు నీటిని ఎత్తిపోతల పనులు దగ్గర పడ్డాయి.
ఇవి పూర్తి అయితే వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో 86,150 ఎకరాలు, ప్యాకేజీ 9, 10, 11, 12 ద్వారా 1.71లక్షల ఎకరాలు, శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 54వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. అప్పర్ మానేరు-మధ్యమానేరు మధ్య 11, మూలవాగుపై 13 చెక్‌డ్యాంలను రూ.155 కోట్లతో చేపడుతున్నారు. కంపోస్ట్ షెడ్‌లోని వ్యర్థాల ద్వారా సేంద్రియ ఎరువును తయారుచేసి ‘రాజన్న సహజ ఎరువులు‘ పేరిట రైతులకు విక్రయిస్తున్నారు. అటు.. సమైక్యరాష్ట్రంలో కన్నీళ్లతోనే కాలం వెల్లదీసిన నేత కార్మికులు.. స్వరాష్ట్రంలో ఆత్మగౌరవబావుటా ఎగురవేస్తున్నారు. మరమగ్గాల కార్మికులకు చేతినిండా ఉపాధి దక్కుతున్నది. ఇప్పటికే రూ.2,500 కోట్ల బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ సందర్భంగా చీరల ఉత్పత్తికి సర్కారు ఆర్డర్లు ఇస్తున్నది. దీంతో 15వేల మందికి పైగా కార్మికులు నెలకు రూ.16వేల చొప్పున జీతం పొందుతున్నారు. పలు కార్యక్రమాల ద్వారా మరమగ్గాల పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం కృషిచేస్తున్నది.
సిరిసిల్ల అభివృద్ధి ఇదీ
రూ.27 కోట్లతో 55వేల టన్నుల సామర్థ్యమున్న 12 వ్యవసాయ గోదాములు.
సర్దాపూర్‌లో రూ.25కోట్లతో 25 ఎకరాల్లో అధునాతన మార్కెట్ యార్డు.
రూ.5.15 కోట్లతో సిరిసిల్లలో రైతుబజార్, రూ.30 లక్షలతో వేములవాడలో రైతుబజార్.
13 మండలాల పరిధిలో 359 ఆవాసాల్లోని 5.5 లక్షలమందికి మిషన్ భగీరథ నీళ్లు. ఇందుకు రూ.1,130 కోట్ల ఖర్చు.
నిర్మాణం పూర్తయిన 3,305 డబుల్ ఇండ్లు.
సర్కారీ సౌధాల ప్రారంభం రేపే..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం పర్యటించనున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. సిరిసిల్ల శివారులో సకల హంగులతో రూపుదిద్దుకొన్న సమీకృత కలెక్టరేట్, తంగెళ్లపల్లి మండలం మండెపల్లి శివారులో ఏర్పాటు చేసిన ఐటీడీఆర్ (అంతర్జాతీయ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్), వేములవాడ బైపాస్ రహదారిలోని శాంతినగర్‌లో నిర్మించిన నర్సింగ్ కాలేజీ, మండేపల్లి సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు, సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయం ఎదురుగా అర్బన్ బ్యాంకు పక్కన నిర్మించిన ఎల్వీప్రసాద్ కంటి దవాఖాన, సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద నిర్మించిన మార్కెట్‌యార్డును ప్రారంభించనున్నారు