తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం అన్ని వైపులా విస్తరిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మౌలిక వసతుల విస్తరణలో కూడా దూసుకుపోతున్నాం. నగరాలకు అభివృద్ధి సూచికలుగా నిలిచేది రహదారులు. హైదరాబాద్ పెరుగుతున్న జనాభా, జనసాంద్రతను దృష్టిలో ఉంచుకుని రహదారులను అభివృద్ధి చేస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎస్ఆర్డీపీలో భాగంగా వంతెనలు, అండర్ పాస్‌లు నిర్మిస్తున్నాం అని మంత్రి తెలిపారు. రూ. 6 వేల కోట్లతో ఎస్ఆర్డీపీ పనులు కొనసాగుతున్నాయి. ఎస్ఆర్డీపీతో పాటు సీఆర్ఎంపీ కింద రూ. 1800 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. వీటితో అదనంగా హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద మొదటి దశలో రూ. 313.65 కోట్లతో 22 లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
ఇప్పటికే 16 రోడ్లను పూర్తి చేశామన్నారు. త్వరలోనే మరో 6 రోడ్లను పూర్తి చేస్తామని చెప్పారు. ఇవాళ ప్రారంభించుకున్న 5 లింక్ రోడ్ల నిర్మాణం రూ. 27.43 కోట్ల వ్యయంతో చేపట్టామని పేర్కొన్నారు. రెండో దశలో రూ. 65 కోట్లతో నాలుగు రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటికి అదనంగా రూ. 230 కోట్లతో మరో 13 రోడ్లను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మరింత పారదర్శకంగా రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. ట్రాఫిక్, ప్రయాణ దూరం తగ్గించేలా లింక్ రోడ్లను పూర్తి చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.