మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శుభాకాంక్షలు తెలిపారు. పీవీ మార్గ్‌లోని జ్ఞానభూమిలో ఏర్పాటు చేసిన పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొని ప్రసంగించారు.
మహా నేత పీవీ నరసింహారావు శత జయంతి.. గొప్ప పండుగ రోజు అని పేర్కొన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలకు హాజరు కావడం సంతోషంగా ఉంది. పీవీ భారతదేశ మాజీ ప్రధాని, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, పేద ప్రజల పెన్నిధి అని తెలిపారు.
పీవీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కర్త అని గవర్నర్ చెప్పారు. పీవీ కాంస్య విగ్రహాన్ని తాను ఆవిష్కరించడం, పీవీ మార్గ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇవాళ ఆవిష్కరించిన పీవీ పుస్తకాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతాయన్నారు. పీవీ రచనలను అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. పీవీ రాజకీయాలకు అతీతంగా గౌరవించుకోదగిన వ్యక్తి అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పేవారని తమిళిసై గుర్తు చేశారు.