ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణను ఎండబెడతామంటే ఊరుకోబోమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ జలదోపిడీని ముమ్మాటికీ అడ్డుకుంటామని స్పష్టంచేశారు. తెలంగాణ హక్కుల సాధన కోసం ఎక్కడిదాకైనా వెళ్తామని చెప్పారు. శనివారం తెలంగాణభవన్‌లో పువ్వాడ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణకు చాంపియన్ అని, తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోరన్న విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అక్రమంగా పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని ఎత్తుకెళ్తుంటే ధైర్యంగా అడ్డుకున్నది సీఎం కేసీఆరేనని కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలని చెప్పారు.
‘;కాంగ్రెస్ హయాంలోనే జలచౌర్యానికి బీజం పడిందన్న సత్యాన్ని తెలంగాణ సమాజం మరిచిపోదని గుర్తుచేశారు. పోతిరెడ్డిపాడుపై వైఎస్ రాజేశేఖర్‌రెడ్డి దొంగలా వ్యవహరిస్తే, ఏపీ సీఎం జగన్ గజదొంగలాగా తయారయ్యారని మంత్రి వేముల చేసిన వ్యాఖ్యలు నూటికి నూరుపాళ్లు నిజమని నొక్కిచెప్పారు. నీటి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతున్నదని, రాయలసీమ ఎత్తిపోతలు నిర్మిస్తున్నారని చెప్పినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తుందని ఆయన ఆరోపించారు.