ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అక్రమ నీళ్ల తరలింపు పరాకాష్టకు చేరిందని, ఏపీ నీటి చౌర్యాన్ని తప్పకుండా అడ్డుకుంటామని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. కేంద్రానికి అబద్దాలు చెబుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతున్నదని విమర్శించారు.
ఏపీ అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ భవన్‌లో మంత్రి పువ్వాడ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ పట్ల తండ్రికి మించిన తనయుడు జగన్మోహన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని చిన్నచూపు చూశారన్నారు. పోతిరెడ్డిపాడు అంశపై తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేసీఆర్ పోరాటం చేశారన్నారు.
రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారని చెప్పారు. బేసిన్లు, భేషజాలకు పోకుండా న్యాయం చేద్దామని, గోదావరి జలాలను సమృద్ధిగా వినియోగించుకుందాని కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. రాయలసీమకు నీళ్లు ఇస్తామనే మాటలను ఏపీ వక్రీకరిస్తున్నదని ఆరోపించారు. రెండు రాష్ట్రాల నీటి వాటాలు ఇంకా తేలలేదని చెప్పారు. వైఎస్‌పై మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాటలు వందశాతం నిజమని చెప్పారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం తాము మాట్లాడుతున్నామని చెప్పారు. వైఎస్ హయాంలో అద్భుతమైన ప్రాజెక్టులు కట్టామని చెబుతున్నారని, ఖమ్మం జిల్లాలో ఒక్క ఎకరానికైనా నీరు వచ్చిందా అని ప్రశ్నించారు. ఏపీ నీటి చౌర్యాన్ని తప్పకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు.