తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రముఖ డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్ రాజేంద్ర శ్రీవత్స రూపొందించిన ‘లిఫ్టింగ్ ఏ రివర్’ శుక్రవారం రాత్రి అంతర్జాతీయ చానల్ డిస్కవరీలో, డిస్కవరీ+ యాప్లో ప్రసారమైంది. సీఎం కేసీఆర్ సునిశిత పరిశీలన, సుదీర్ఘ అధ్యయనం, చెక్కుచెదరని సంకల్పానికి ఈ డాక్యుమెంటరీ దర్పణం పట్టింది.
ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సమాజం ఆద్యంతం తిలకించి పులకించిపోయింది. దాదాపు గంటపాలు జనమంతా టీవీలకే అతుక్కుపోయారు. కార్యక్రమాన్ని తిలకిస్తూ యువత, అన్నదాత పులకించిపోయారు. ఎత్తిపోతల పథకం నిర్మాణ కౌశలతను తెలుసుకుని ప్రతి ఒక్కరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ప్రాజెక్టును వీక్షించిన ప్రతిఒక్కరూ ‘హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్’ అంటూ ప్రశంసించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రతి అంచెను, ఎదురైన సవాళ్లను, వాటిని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన వ్యూహాలను, పద్ధతులను ఈ డాక్యుమెంటరీ కండ్లకు కట్టింది. ఇంజినీరింగ్ ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞానాన్ని సాక్షాత్కరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును ఒక రాష్ట్రప్రభుత్వం చేపట్టడం, ప్రపంచంలోనే అతిపెద్ద 139 మెగావాట్ల సామర్థ్యమున్న పంపులను వినియోగించడాన్ని ప్రపంచం మొత్తం అభినందించింది.