తెలంగాణ రాష్ట్రంలోని బాలాపూర్‌కు చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు సింగిరెడ్డి చంద్రపాల్‌రెడ్డి(41) గురువారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.
గత అసెంబ్లీ/పార్లమెంట్ ఎన్నికల సమయంలో మంత్రి సబితారెడ్డి వెన్నంటి ఉంటూ అన్ని కార్యక్రమాల్లో, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో టీఆర్‌ఎస్ పథకాలు, మంత్రి సబితారెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసేవారు.
కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. కాగా గురువారం ఉదయం గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు.ఆయన మృతిపట్ల మంత్రి సబితారెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వెంటనే బాలాపూర్‌కు వెళ్లి చంద్రపాల్ మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు.
బడంగ్‌పేట్ మేయర్ పారిజాతానర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ శేఖర్, బండ్లగూడ రైతు సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి పెంటారెడ్డి, వైస్ చైర్మన్ కొలన్ తిరుపతిరెడ్డి, కార్పొరేషన్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్‌రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు కొలన్ శంకర్‌రెడ్డి, పలువురు నాయకులు, కార్పొరేటర్లు ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గురువారం సాయంత్రం బాలాపూర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.