వరుస కరువులతో అల్లాలడిన తెలంగాణా నేల ఇపుడు వ్యవసాయానికి పూర్తిగా అనుకూలంగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి సమయాన్ని రైతాంగం తమకు అనుకూలంగా మలుచుకుంటే ఆర్థికంగా పరిపుష్టి కాగలుతారని ఆయన తేల్చిచెప్పారు. అందుకు చేయవలసిందల్లా మూస పద్ధతుల్లో చేసే వ్యవసాయానికి స్వస్తి పలికి వాణిజ్య పంటలవైపు రైతులు దృష్టి సారించాలని రైతాంగానికి మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.అందులో అవగాహన పెంపొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతువేదికల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారన్నారు.
సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్పహాడ్ మండలం చీదేళ్ల,ధూపాడ్ గ్రామాలలో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను మంత్రి జగదీష్ రెడ్డి గురువారం రోజు ప్రారంభించారు.అనంతరం ధూపాడ్ లో రైతులతో మంత్రి జగదీష్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ధూపాడ్ గ్రామంలో ఉన్న భూములో 80 శాతానికి పై బడి వ్యవవసాయనికి అనుకూలంగా ఉందని ఇక్కడ రైతులు చేపల పెంపకం,వేరుశనగ,ఫామయిల్ వంటి వాణిజ్య పంటల వైపు దృష్టి సారిస్తే అధిక ఆదాయం గడించ వచ్చన్నారు.
ఇప్పటికే గ్రామంలో వాణిజ్య పంటలు పండిస్తూ అధిక లాభాన్ని పొందినట్లు ముఖాముఖి లో చెప్పిన రైతులను మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.యింకా ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రజాక్,స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలితా ఆనంద్,స్థానిక యం పి పి నెమ్మాది బిక్షం,జడ్ పి టి సి తదితరులు పాల్గొన్నారు