హుజురాబాద్ నియోజకవర్గంలో తెరాసకు భారీ మద్దతు లభిస్తుంది. గ్రామాలకు గ్రామాలే ముక్తకంఠంతో మద్దతు ప్రకటిస్తున్నాయి, మాతోనే తెరాస… తెరాసతో మేమంటూ నినదిస్తున్నాయి. తాజాగా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బొర్నపల్లితో పాటు 12, 14, 24 వార్డులకు చెందిన పలు సంఘాల నాయకులు బిసి సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను కరీంనగర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిశారు, తమకు కావాల్సింది అభివృద్ధి అని, అది తెరాస తోనే సాధ్యమని తాము ఎప్పుడు తెరాస వెంటే ఉంటామని మంత్రి గంగుల కమలాకర్ కు మద్దతు లేఖను అందించారు.
గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ పట్టించుకోక పోవడంతో తమ వార్డుల్లో సమస్యలు అలాగే ఉండి పోయాయని మంత్రి గంగులతో తమ గోడును వెళ్ళబోసుకున్నారు. తమకు కమ్యూనిటీ హాల్ తో పాటు పెద్దమ్మ దేవాలయం నిర్మించి ఇవ్వాలని, అలాగే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కోరారు.
దీనికి స్పందించిన మంత్రి గంగుల వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు, అంతేకాకుండా కమ్యునిటీహాల్. పెద్దమ్మ తల్లి దేవాలయం విషయం సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేస్తామని వారికి స్పష్టం చేశారు. మంత్రి గంగుల హామి ఇవ్వడంతో సంఘాల ప్రతినిధులు మంత్రికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. తామోప్పుడూ తెలంగాణా వాదులమేనని, తెలంగాణ సాధించిన టిఆర్ఎస్ కు నిరంతరం అండగా ఉంటామన్నారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. తెరాస అంటే అభివృద్ధి అని అభివృద్ధి అంటే తెరాస అని ఎన్నికలేవైనా అభ్యర్థి ఎవరైనా తమ ఓటు మాత్రం టిఆర్ఎస్ కే వేసి గెలిపించుకుంటామన్నారు. రాబోయే ఎన్నికల్లో హుజురాబాద్లో టీఆర్ఎస్ గెలుపు ఏకపక్షమేనని తమ అభిప్రాయాలని వెలిబుచ్చారు.