కరోనా కారణంగా గత 15 నెలలుగా ప్రజలు బయటకు రావడం తగ్గించేశారు. ఒకవేళ బయటకు రావాల్సి వచ్చినా మాస్కులు పెట్టుకుని, భౌతిక దూరం పాటిస్తున్నారు. ఇక స్కూళ్లు మూతపడటంతో పిల్లలు ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇరుగు పొరుగు పిల్లలతో ఆడుకోవడానికి కూడా వెళ్లనీయడం లేదు.
దీంతో వైరస్, బ్యాక్టీరియా కారణంగా వచ్చే ఫ్లూ, ఇతర జబ్బుల బారిన పడడటం తగ్గిపోయింది. దీంతో వాటిని ఎదుర్కొనే సామర్థ్యం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల కరోనా మహమ్మారి తగ్గిపోయాక చాలా రకాల వ్యాధులను ఎదుర్కొనేందుకు కావాల్సిన ఇమ్యూనిటీని పిల్లలు పొందలేకపోతున్నారు అని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా చిన్న పిల్లల్లో వచ్చే శ్వాసకోశ వ్యాధి రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ ( RSV ) విషయంలోనూ వైరాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనాకు ముందు ఇతర సీజనల్ వ్యాధులతో పోలిస్తే ఈ RSV బారిన పిల్లలు ఎక్కువగా పడేవారని నిపుణులు చెబుతున్నారు.
కరోనాకు ముందు యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఏటా 30 వేలకు పైగా చిన్నారులు ఈ RSV బారిన పడేవారు అని అంచనా. వీరంతా ఐదేళ్ల లోపు చిన్నారులే కావడం గమనార్హం. కానీ కరోనా కారణంగా మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించడం వల్ల గత రెండేళ్లుగా ఈ వైరస్ కేసులు నమోదు కావడం లేదు.
దీనివల్ల ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన రోగ నిరోధక శక్తిని పిల్లలు పొందలేకపోతున్నారు. పిల్లల్లో ఈ వైరస్‌ను ఎదుర్కొనే అంత ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత ఈ RSV మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నాటింగ్‌హామ్ యూనివర్సిటీలో వైరాలజీ విభాగ ప్రొఫెసర్ విలియం ఐర్వింగ్ హెచ్చరించారు.