వచ్చే ఏడాది కామారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, పోలీసు కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. నూతన సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తర్వాత దశలో వచ్చే మెడికల్ కాలేజీల్లో మొదటిది కామారెడ్డిలోనే ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున, జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ అప్‌గ్రేడ్ చేస్తామన్నారు.
ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా..
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ తాగునీరు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా, కల్యాణలక్ష్మి, రైతు బంధు ఇలా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. కాకతీయ రెడ్డి రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల కింద 10 లక్షల ఎకరాలు పారేది. తెలంగాణలో మేజర్ ఇరిగేషన్‌గా ఉన్న చెరువులను సమైక్య పాలనలో నాశనం చేశారు. చెరువుల కింద సాగును గత పాలకులు మైనర్ ఇరిగేషన్‌గా మార్చారు. కాకతీయుల స్ఫూర్తితోనే మిషన్ కాకతీయ పథకం తెచ్చాం.
తెలంగాణను సమైక్య పాలకులు పట్టించుకోలేదు. వాళ్లకు సంచులు మోసిన సన్నాసులు పట్టించుకోలేదు. సిగ్గులేకుండా ఇప్పుడు కొంత మంది ధర్నాలు చేస్తున్నారు. తెలంగాణ వాళ్లకు వ్యవసాయం రాదన్నోళ్లు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వలేదు. తెలంగాణ కరెంట్ సమస్య తీరింది. విద్యుత్ తలసరి వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్. ఇక భవిష్యత్‌లో సమస్య రాదని సీఎం తెలిపారు.