తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు ఎంపీటీసీలు ఈ రోజు మంత్రి కే తారకరామారావుని ప్రగతి భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విజ్ఞప్తులను మంత్రి కేటీఆర్ కి అందించారు. వేములవాడ స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ గారి సూచన మేరకు కథలాపూర్ నియోజకవర్గంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ని కోరారు.
కతలాపూర్ మండలం గంభీర్పూర్ లో 344 ఎకరాలలో మామిడి, పసుపుకు సంబంధించి స్పెషల్ ఫూడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజా ప్రతినిధులు మంత్రికి ఈ సందర్భంగా ఒక విజ్ఞాపన పత్రాన్ని అందించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా అందుబాటులో ఉన్న మామిడి, పసుపు పంటలకు సంబంధించి రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. జగిత్యాల జిల్లాలో 36 వేల ఎకరాలలో మామిడి సాగుతో తెలంగాణలోనే మొదటి స్థానం, పసుపు 22 వేల ఎకరాలలో సాగుతో రెండవ స్థానంలో ఉంది. ఈ రెండు ప్రధాన పంటల ప్రాసెసింగు, శుధ్ధి, స్థానికంగా జరిగితే రైతులకు గిట్టుబాటు, వ్యవసాయాదాయానికి భరోసా మరియు వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తెలిపారు.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి ప్రైవేటు, సహకార రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో రాయితీలు కల్పించిందన్నారు. స్పెషల్ ఫూడ్ ప్రాసెసింగ్ జోన్ ను ఏర్పాటు చేసేందుకు కథలపూర్ మండలం లోని గంభీర్పుర్ గ్రామంలోని 344 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందన్నారు. ఈ ప్రతిపాదన పైన సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు పైన గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి ఆయన దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానని స్థానిక ప్రజా ప్రతినిధులకు హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ కి ఈ సందర్భంగా శాసనసభ్యులు చెన్నమనేని రమేష్, మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి, జడ్పిటిసి నాగం భూమయ్య, ఎంపిపి జవ్వాజి రేవతి గణేష్, వైస్ ఎంపీపీ కిరణ్ రావు, ఎంపిటిసిలు ధన్యవాదాలు తెలిపారు.
మండల స్థానిక సంస్థల ప్రతినిధులు మంత్రి కేటీఆర్ ను కలిసిన సందర్భంగా ….స్థానిక ఎమ్మెల్యే రమేష్ గారు మంత్రి కేటీఆర్ తో ఫోన్ లో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కోసం విజ్ఞప్తి చేయడం జరిగింది.