సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు చాలా పద్ధతిగా కనిపిస్తుంటారు. అంతకు ముందులా ఏ క్యారెక్టర్ పెడితే ఆ క్యారెక్టర్ ఒప్పుకోరు. కచ్చితంగా తమకంటూ కొన్ని ఆంక్షలు పెట్టుకుంటారు. అయితే కొందరు ముద్దుగుమ్మలు మాత్రం పెళ్లి, కెరీర్ వేరు అంటున్నారు. రెండూ వేటికవే ప్రత్యేకం అంటున్నారు. దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఉంది అంటూ హితబోధ చేస్తున్నారు. అందులో కాజల్ అగర్వాల్, సమంత అక్కినేని లాంటి వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే పెళ్లి తర్వాత కూడా సమంత అక్కినేని సంచలన పాత్రలు చేస్తోంది.
ఇప్పుడు కాజల్ కూడా ఇదే చేయబోతుంది. గతేడాది గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తోంది. పెళ్లి తర్వాత కూడా కొనసాగిస్తాననే కండిషన్ మీదే ఈమె పెళ్లి చేసుకుంది. అనుకున్నట్లుగానే పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుంది కాజల్. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా ఆచార్య.. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మరోవైపు తమిళంలో కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు సీక్వెల్లో ఈమె నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది.
ఆచార్య షూటింగ్ కూడా జరగడం లేదు. అయితే నాగార్జున సినిమాలో మాత్రం ఒక సంచలన పాత్ర చేస్తోంది చందమామ. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ ఒక స్పై పాత్రలో నటిస్తుంది. అలాగే ఈ పాత్ర వేశ్య కూడా అని తెలుస్తోంది. తీవ్రవాదుల గుట్టు రట్టు చేయడానికి తన అందచందాలతో వాళ్లను ఆకట్టుకుంటూ.. వాళ్ళతో రొమాన్స్ చేస్తూ అక్కడి రహస్యాలను తన డిపార్ట్మెంట్ కు అందజేసే పాత్ర ఇది. ఒకవైపు గూడాచారి, మరోవైపు వేశ్య ఈ రెండూ కలగలిపి ఉన్న పాత్రను కాజల్ అద్భుతంగా పోషిస్తుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో సూపర్ యాక్షన్ సీక్వెన్స్ లో కూడా కాజల్ నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా తన కెరీర్లో ఇదొక చాలెంజింగ్ రోల్ అవుతుంది అంటూ నమ్మకంగా చెబుతుంది చందమామ. ఏదేమైమా కూడా పెళ్లి తర్వాత ఇంతటి చాలెంజింగ్ పాత్ర చేస్తుండడం ఒకరకంగా సాహసమే. మరి దీనికి కాజల్ ఎంతవరకు న్యాయం చేస్తున్నావ్ చూడాలి.