తెలంగాణ వ్యాప్తంగా ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్షలను పేద ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకుగాను రాష్ట్రంలో మరిన్ని డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్తగా 15 జిల్లాల్లో 16 చోట్ల ఈ కేంద్రాలను, గ్రేటర్ హైదరాబాద్ పరిఽధిలో మరో 12 చోట్ల మినీ హబ్‌లను ఏర్పాటు చేయనుంది. వీటిని ఈ ఏడాది ఆగస్టు నాటికి అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ కేంద్రాల్లో మొత్తం 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఇప్పటికే 19 జిల్లాల్లో 19 డయాగ్నస్టిక్ కేంద్రాలను ఈ నెల 9న అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇవి కాకుండా.. అవసరమైన చోట్ల మరికొన్నింటిని కొత్తగా ప్రారంభిస్తామని ఈ నెల 5న వైద్య ఆరోగ్యశాఖపై జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ వెల్లడించారు.