ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ మన దేశంలో చట్టపరమైన రక్షణను కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా బుధవారం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇన్మర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను పాటించకపోవడంతో ట్విటర్‌కు చట్టపరమైన రక్షణను తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో ట్విటర్ ఇకపై తటస్థ, మధ్యవర్తిత్వ వేదిక కాదని, ఇది డిజిటల్ న్యూస్ పబ్లిషర్‌గా ఉంటుందని సమాచారం.
జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, కొత్త ఐటీ నిబంధనల ప్రకారం భారత దేశంలో చీఫ్ కాంప్లియెన్స్ ఆఫీసర్‌ను ట్విటర్ నియమించవలసి ఉంది. ప్రభుత్వం లేఖలు రాసినప్పటికీ ట్విటర్ పట్టించుకోలేదు. మరొక వారం గడువు ఇవ్వాలని అడిగింది. ఆ గడువు కూడా పూర్తయినప్పటికీ చీఫ్ కాంప్లియెన్స్ ఆఫీసర్‌ను ట్విటర్ నియమించలేదు. దీంతో ట్విటర్ లీగల్ ఇండెమ్నిటీని కోల్పోయింది.
నష్టానికి బాధ్యతవహించవలసిన అవసరం లేకుండా చట్టప్రకారం లభించిన మినహాయింపును కోల్పోయింది. అయితే ట్విటర్ తటస్థ, మధ్యవర్తిత్వ వేదిక హోదాను కోల్పోయినట్లు ఆ సంస్థకు ఎటువంటి ఆదేశాలను ప్రభుత్వం జారీ చేయబోదని అధికారులు తెలిపారు. తటస్థ హోదాను కోల్పోవడం వల్ల అభ్యంతరకరమైన కంటెంట్ పోస్ట్ అయితే, దానికి ట్విటర్ బాధ్యతవహించవలసి ఉంటుంది.