తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి రైతుబంధు పంపిణీని ప్రారంభించింది. తొలిరోజు ఎకరా భూమి గల రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. రైతుబంధు పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలిరోజు 16,95,601 మంది రైతులకు రైతుబంధు అందింది. 10,33,915 ఎకరాలకు రూ. 516.95 కోట్లు పంపిణీ చేయడం గమనార్హం.
తొలిరోజు రైతుబంధు అందుకున్న వారిలో నల్లగొండ రైతులు ఎక్కువగా ఉండగా ఆదిలాబాద్ రైతులు తక్కువగా ఉన్నారు. నల్లగొండకు చెందిన 11,970 మంది రైతులకు రూ.36.10 కోట్లు పంపిణీ చేశారు. ఇక ఆదిలాబాద్‌లో 9,628 మంది రైతులకు రూ.35.60 కోట్లు అందించింది. ఇక బుధవారం రెండెకరాల భూమి గల రైతులకు పంపిణీ చేయనున్నారు.
ఇందులో భాగంగానే 23.05 లక్షల ఎకరాలకు సంబంధించి 15.07 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1152.46 కోట్లు జమ చేయనున్నది. ఇక రైతుబంధు పంపిణీ విజయవంతంగా కొనసాగడంపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. రైతుబంధు పొందిన రైతులకు అభినందనలు తెలిపారు.