ఆక్సిజన్.. కొవిడ్ మహమ్మారి కారణంగా మనుషుల ఊపిరి నిలిపే ఈ ప్రాణ వాయువు కోసం నిన్నటిదాకా యావత్తు దేశం అల్లాడింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లో సరికొత్త ప్రయత్నానికి బీజం పడింది. ఎల్బీనగర్‌లో కామినేని దవాఖాన ముందున్న ఫ్లైఓవర్ వేదిక అయింది.
ఢిల్లీ ఐఐటీ, అమెరికా స్పేస్ సెంటర్ నాసా అధ్యయనం ద్వారా ఆక్సిజన్ అధికంగా అందించే వేల మొక్కలతో ఈ ఫ్లైఓవర్ కింద ఆక్సిజన్ పార్కును సిద్ధం చేస్తున్నారు. వీటిమధ్య వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
దీనిపై నడవటం ద్వారా ఫిట్‌నెస్‌తోపాటు, స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు వీలవుతుంది. రూ.2 కోట్ల జీహెచ్‌ఎంసీ నిధులతో నిర్మించనున్న ఈ ఆక్సిజన్ పార్కు పనులు ఇటీవలే మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ స్ఫూర్తితో ఈ పార్కు నిర్మాణం జరుగుతున్నదని, ఆగస్టు చివరికి పూర్తి చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చెప్పారు.