తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాస్‌రావు తెలిపారు. సోమవారం డీహెచ్ శ్రీనివాస్ రావు మీడియా ద్వారా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. లాక్‌డౌన్ ప్రారంభంలో 90 శాతమున్న రికవరీ రేటు ప్రస్తుతం 96 శాతానికి పెరిగిందన్నారు. ఈ వారంలో పాజిటివిటీ రేటు 1.40 శాతంగా ఉందన్నారు. ఫీవర్ సర్వే, కొవిడ్ ఓపీ వల్ల కరోనాను నియంత్రించగలిగినట్లు తెలిపారు.
16.74 లక్షల మంది హైరిస్క్ గ్రూపు వారికి వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించారు. ప్రతిరోజు 2 లక్షల మందికి తగ్గకుండా వ్యాక్సిన్ వేస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణలో ప్రణాళికాబద్దంగా పనిచేస్తున్నామన్నారు. త్వరలోనే స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
కరోనా చికిత్స విషయంలో ఇప్పటి వరకు 350 ఫిర్యాదులు అందగా ఆయా ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మలేరియా నివారణలో ముందున్నామన్నారు. 2025 కల్లా మలేరియా రహిత రాష్ట్రంగా తెలంగాణ అవతరించనుందన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపుతో ఫ్రై డే.. డ్రై డేగా నిర్వహిస్తున్నట్లు డీహెచ్ తెలిపారు.