గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు..వాటి అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తున్నది. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులకు ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతినెలా నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి నేటివరకు ప్రతినెలా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకు ఇప్పటివరకు రూ.2,525 కోట్లు అందజేశారు. చిన్న గ్రామాలకు సైతం నిధులను విడుదల చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల రూపురేఖలు మార్చేందుకు సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడున్నవి, కనిపిస్తున్నవి ఒకనాటి గ్రామాలేనా అనేరీతిలో గ్రామాలు అభివృద్ధి చెందాయి.
కరోనా సంక్షోభంతో ఆదాయం తగ్గినా గ్రామాలకు విడుదల చేసే నిధుల్లో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని కేసీఆర్ ఆదేశించారు. పైఅధికారుల అనుమతి అవసరం లేకుండా పంచాయతీ పాలకవర్గం తీర్మానంచేసి అందుబాటులోఉన్న ఎన్ని నిధులనైనా ఖర్చు చేసుకునే వెసులు బాటును కూడా కల్పించారు. ఈ నిబంధన ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. దీంతో గ్రామాల రూపురేఖల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి.