కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మంచి పురోగతి సాధించామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ విధానాలు, సమష్టి కృషితోనే ఇది సాధ్యమయ్యిందన్నారు. సీఎం దార్శనికతతో దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతున్నామని చెప్పారు. నగరంలోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో పరిశ్రమలు, ఐటీ శాఖ వార్షిక నివేదికలను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారదర్శకత కోసం వార్షిక నివేదికలు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. కరోనా కారణంగా సాదాసీదాగా కార్యక్రమం జరుపుతున్నామని చెప్పారు.
2020-21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9.78 లక్షల కోట్లుగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో 20.9 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. దేశ తలసరి ఆదాయం రూ.1,27,768గా ఉండగా, రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,27,145గా ఉందన్నారు. 2019-20లో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.1.28 లక్షల కోట్లు కాగా, 2020-21లో అవి రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయని చెప్పారు. ఐటీలో దేశంతో పోలిస్తే రెట్టింపు వృద్ధి సాధించామన్నారు.
జాతీయస్థాయితో పోలిస్తే రాష్ట్ర ఉద్యోగిత మెరుగ్గా ఉందని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 3.23 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని, ఏడేండ్ల తర్వాత ఆ సంఖ్య రెట్టింపయ్యిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ఐటీ రంగం 6.28 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పిస్తున్నదని పేర్కొన్నారు. సుమారు 20 లక్షలకుపైగా మంది ఐటీ రంగంపై ఆధారపడి పనిచేస్తున్నారని తెలిపారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను కేంద్రం ఆదుకోవాలని కోరారు. దీనికోసం రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్‌కు వస్తున్నాయని చెప్పారు. ప్రముఖ కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయన్నారు. పెట్టుబడులు, అంకెలే మా వృద్ధికి సంకేతం అని వెల్లడించారు. ద్వితీయ శ్రేణి నగరాలకూ శరవేగంగా ఐటీ విస్తరిస్తున్నదని తెలిపారు. కార్యాలయాల విస్తీర్ణంలో బెంగళూరును అధిగమించామని చెప్పారు. రామగుండం, సిద్దిపేట, నల్లగొండలోనూ త్వరలో ఐటీ టవర్లను ఏర్పాటుచేస్తామన్నారు. వచ్చే రెండేండ్లలోనే ఐటీ టవర్లను ప్రారంభిస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్ రంగంలో రూ.4 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ దివిటి ప్రాంతంలో త్వరలో సోలార్ పార్క్‌ను ఏర్పాటుచేస్తున్నామని వెల్లడించారు. గత ఐదేండ్లుగా మంత్రి కేటీఆర్ తన శాఖ వార్షిక నివేదికలను విడుదల చేస్తున్నారు.