దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. రాష్ట్రాలు విధించిన ఆంక్షల ఫలితంగా వరుసగా మూడోరోజు లక్షకు దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 94వేల మందికి కరోనా సోకింది. అయితే బిహార్ ప్రభుత్వం మరణాల లెక్కను సవరించడంతో మృతుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించింది. రికవరీ రేటులో పెరుగుదల, క్రియాశీల కేసులు తగ్గుతుండటం ఊరటనిచ్చే విషయాలు. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది._
_⇒ బుధవారం 94,052 మంది కరోనా బారిన పడ్డారు. రెండురోజులుగా కొత్త కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 2,91,83,121 చేరింది._
_⇒ 24గంటల్లో 6,148 మంది మృత్యుఒడికి చేరున్నారు. బిహార్ ప్రభుత్వం మరణాల లెక్కను సవరించడంతో ఈ సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించింది. ఇప్పటి వరకు 3,59,676 మంది ఈ మహమ్మారికి బలయ్యారు._
_⇒ నిన్న ఒక్కరోజే 1,51,367 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీలు 2.76కోట్లకు చేరుకున్నాయి. రివకవరీ రేటు 94.55శాతానికి చేరింది. వరుసగా 28వ రోజు కొత్తకేసుల కంటే రికవరీలే అధికంగా ఉన్నాయి._
_⇒ వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో క్రియాశీల కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 11లక్షల మందికిపైగా కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 4.23శాతానికి చేరింది._
_⇒ నిన్న 20,04,690 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 37,21,98,253కి చేరింది._
_⇒ మరోపక్క నిన్న 33,79,261 మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 24 కోట్ల మార్కును దాటింది._