“జంగారెడ్డిగూడెం అభివృద్ధి లో కీలకం కానున్న జాతీయ ప్రాజెక్ట్” ప్రధానమంత్రి భారతీ మాల పథకంలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొదటగా ప్రారంభం కానున్న ” ఖమ్మం- దేవరపల్లి” గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పశ్చిమగోదావరి మెట్ట ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నది.
సరైన రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొయ్యలగూడెం ప్రాంతాలకు జాతీయ రహదారి వరం కానున్నది. మా ప్రాంతంలో జాతీయ రహదారులు ఉన్నాయిగా మొదటి జాతీయ ప్రాజెక్ట్ అంటున్నారేమిటి అన్న అనుమానం కలగవచ్చు. జాతీయ రహదారులను రెండు వర్గాలుగా విభజిస్తారు, మొదటిది జాతీయ రహదారుల సంస్థ (National Highway Authority of India) అధీనం లో నిర్వహింపబడే రహదారులు కాగా, రెండవ రకం రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే రహదారులు. మొదటి రకం రహదారులు పూర్తిగా NHAI ఆధ్వర్యంలో నిర్మాణం, నిర్వహణ జరుగుతాయి.
రెండవ రకం జాతీయ రహదారులకు కేంద్రం నిధులు మాత్రమే ఇస్తుంది, నిర్మాణం నిర్వహణ అంత రాష్ట్ర ప్రభుత్వ అధీనం లో జరుగుతుంది. ప్రస్తుతం మన జిల్లాలో జీలుగుమిల్లి నుండి దేవరపల్లి ( పూర్వం తల్లాడ – దేవరపల్లి రాష్ట్ర రహదారి నెంబర్ 7) వరకు ఉన్న జాతీయ రహదారి రాష్ట్ర అధీనం లో నిర్వహింపబడుతున్న రహదారి. ఇటువంటి రహదారులు పేరు గొప్ప ఊరు దిబ్బ రహదారులు. ప్రస్తుతం జీలుగుమిల్లి నుండి రాజమండ్రి వరకు బుట్టాయిగూడెం , కన్నాపురం మీదుగా నిర్మిస్తున్న రహదారి కూడా ఇలాంటి జాతీయ రహదారీ. అందువల్లే జంగారెడ్డిగూడెం ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్మిస్తున్న 4 లైన్ల జాతీయ రహదారి ” ఖమ్మం – దేవరపల్లి” జాతీయ రహదారి.
ప్రాజెక్ట్ పూర్వాపరాలు……………
2015 వ సంవత్సరంలో కేంద్రమంత్రి మండలి తీసుకున్న ఒక కీలక నిర్ణయం ” ప్రధానమంత్రి భారతీమాల, సాగర్ మాల” పథకాలు. దేశంలో 24800 కి.మీ. జాతీయ రహదారుల నిర్మాణం భారతీమాల క్రింద, 93 నౌక పోర్టులకు రహదారి, రైల్ దారి నిర్మాణం కు సాగరమాల ప్రాజెక్టులు రూపొందించారు. ( ప్రస్తుతం మన కొవ్వూరు- భద్రాచలం రైల్వే లైన్, కాకినాడ పోర్ట్ కు తెలంగాణ రాష్ట్రాన్ని కలుపుతూ సాగరమాల పథకంలో చేర్చారు). 2018 జూన్ 25 వ తారీకున తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అధునాతన రహదారి ఏర్పాటు చేయదలచి ” ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ రహదారి” ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొదట “సూర్యాపేట- దేవరపల్లి” మధ్య రహదారి అనుకున్నప్పటికి అప్పటికే ఖమ్మం- సూర్యాపేట మధ్య 4 వరసలు జాతీయరహదారి ( బ్రౌన్ ఫీల్డ్ రహదారి) మంజూరు కావడం తో ఆ రోడ్ కు అనుసందానిస్తూ 365BG నెంబర్ తో ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ రహదారి ప్రకటించారు.
“బ్రౌన్ ఫీల్డ్ రహదారి, గ్రీన్ ఫీల్డ్ రహదారి” మధ్య తేడా ఏమిటి?
ఇప్పటి వరకు భారతదేశంలో నిర్మిస్తున్న జాతీయ రహదారులు బ్రౌన్ ఫీల్డ్ రహదారులు.
ఈ బ్రౌన్ ఫీల్డ్ రహదారులు జనసమర్ధం ఉన్న పట్టణాలు, గ్రామాల గుండా ప్రయాణిస్తాయి. వీటితో అనేక రహదారులు అనుసంధానం అయ్యి ఉంటాయి. ఈ రహదారులు అంత భద్రం అయినవి కావు. మన జిల్లా గుండా వెళ్లే మద్రాసు- కలకత్తా జాతీయ రహదారి బ్రౌన్ ఫీల్డ్ జాతీయ రహదారి. ఈ రహదారులు మృత్య మార్గాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఏలూరు ఆశ్రమ కళాశాలవద్ద, తణుకు జఎంక్షన్ వద్ద ఇతర మార్గాలనుండి ఈ జాతీయ రహదారిపై వాహనాలు ప్రవేశించడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతాయి. మన దేశంలో మొదట నిర్మించిన గ్రీన్ఫీల్డ్ రహదారి పూణే- ముంబయి జాతీయ రహదారి.
ఈ రహదారిపై 120 కి.మీ వేగంతో వాహనాలు ప్రయాణిస్తాయి. 200 కి.మీ. దూరం కేవలం 3 గంటల ప్రయాణం. రెండవ గ్రీన్ఫీల్డ్ రహదారి గ్రేటర్ నోయిడా(ఢిల్లీ) నుండి ఆగ్రా జాతీయ రహదారి. ఈ రహదారి ప్రయాణం నేను స్వయంగా చూసాను. కేవలం 3 గంటల్లో ఢిల్లీ నుండి బస్ ద్వారా ఆగ్రా చేరిన అనుభూతి ఉంది. అదే కార్ అయితే 2 గంటలే. గ్రీన్ ఫీల్డ్ రహదారి చాలా అధునాతన రహదారులు. ఈ రహదారుల నిర్మాణం పెద్ద మలుపులు ఉండవు. ఎంత దూరం అయినా నిదానంగానే ఉండేలా చూస్తారు. చాలా తక్కువ చోట్ల మాత్రమే క్రాసింగ్ అవకాశం ఇస్తారు. రోడ్ మొత్తం ఇరువైపులా ఇనుప కవచం నిర్మిస్తారు. పశువులు, వ్యవసాయ ట్రాక్టర్లు వంటివి గాని గ్రామాలు ఉన్నచోట వాహనాలతో ప్రవేశించడం ఈ రహరులపై కుదరదు. 120 కి.మీ స్పీడ్ వరకు ఈ రహదారులపై అనుమతిస్తారు.
మన రాష్ట్రానికి సంబంధించిన గ్రీన్ ఫీల్డ్ రహదారులు
1. ఖమ్మం- దేవరపల్లి, 2.విజయవాడ- నాగపూర్., 3. విశాఖపట్నం – రాయపూర్….
” ఖమ్మం- దేవరపల్లి” గ్రీన్ ఫీల్డ్ రహదారి వల్ల ప్రయోజనం ఏమిటి?
1. విశాఖపట్నం- హైద్రాబాద్ మధ్య ప్రయాణ దూరం, కాలం తగ్గించడం. ప్రస్తుతం విశాఖపట్నం నుండి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు దేవరపల్లి వద్ద గ్రీన్ ఫీల్డ్ రహదారి ద్వారా జంగారెడ్డిగూడెం, ఖమ్మం, సూర్యాపేట మీదుగా ప్రయాణిస్తాయి. ఈ రహదారి గుండా రాజమండ్రి నుండి 6 గంటల ప్రయాణం ద్వారా హైదరాబాద్ చేరుకోవచ్చు అని అంచనా వేస్తున్నారు. సుమారు 80 కిలోమీటర్ల దూరం కలిసి వస్తుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ రహదారి అందుబాటులోకి వస్తే విశాఖ- హైదరాబాద్ ప్రయాణం విజయవాడ మీదుగా పూర్తిగా తగ్గిపోనున్నది.
2. దక్షిణ భారతదేశంలోని చాలా ప్రాంతాలకు ఈ రహదారి ద్వారా ఉత్తరభారత ప్రయాణం సులభం అవుతుంది. ఖమ్మం- దేవరపల్లి రహదారి విజయవాడ నాగపూర్ రహదారికి అనుసంధానం చెయ్యడం ద్వారా నేరుగా ఢిల్లీ కి 4 వరసలు రహదారి ఏర్పడనున్నది.
3. తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో లభించే బ్లాక్ స్టోన్ ను కాకినాడ పోర్ట్ కు తరలించుటకు ఈ మార్గం ఎంతో ప్రయోజనకరం.
” ఖమ్మం – దేవరపల్లి” ప్రాజెక్ట్ వివరాలు.
తెలంగాణ రాష్ట్రం లోని ఖమ్మం నుండి ఆంధ్రా లోని దేవరపల్లి కి 162 కి.మీ. ల జాతీయరహదారి నిర్మాణం జరగనున్నది. ( ప్రస్తుత రహదారి ద్వారా ఖమ్మం నుండి దేవరపల్లి కి ప్రయాణ దూరం 185 కి.మీ. లు. ఏరియల్ డిస్టన్స్ ద్వారా ఈ రహదారి అలైన్మెంట్ రూపొందించడం వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, అశ్వారావుపేట పట్టణాలకు ఈ రహదారి దూరం అయ్యింది. పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి పట్టణానికి ఇది దగ్గరగా ఏర్పడింది.
ఈ రహదారి ప్రతి పట్టణానికి 5.5 కి.మీ. దూరం ఉండేలా రూపొందించారు. ఖమ్మం పట్టణానికి 5.5 కి.మీ. వద్ద ప్రారంభం అయ్యే ఈ రహదారి దేవరపల్లి కి 2.5 కి.మీ.వద్ద గుండుగోలను- కొవ్వూరు జాతీయరహదారి కి అనుసంధానం అవుతుంది. ఈ రహదారి కి కొన్ని చోట్ల మాత్రమె ఇంటర్ కనెక్టివిటీ ఇచ్చారు అవి. 1. వైరా- జగ్గయ్యపేట రాష్ట్ర రహదారి. 2. కల్లూరు- హనుమాన్ జుంక్షన్ రహదారి 3. జగధల్పూర్ – విజయవాడ జాతీయరహదారి కి వి.ఎం. బంజరు వద్ద. 4. సత్తుపల్లి- నూజివీడు మార్గం 5. దమ్మపేట- చింతలపూడి మార్గంలో రేచెర్ల వద్ద 6. జంగారెడ్డిగూడెం – ఏలూరు మార్గంలో పుట్లగట్లగుడెం వద్ద, 7. కొయ్యలగూడెం – నల్లజెర్ల మార్గంలో ఆరిపాటి దిబ్బల వద్ద మాత్రమే రోడ్ లు ఏర్పాటు చేస్తారు.
ప్రాజెక్ట్ అంచనా…..
1. ఈ 162 కి.మీ ల రహదారి నిర్మాణానికి మొత్తం 1411 హెక్టార్ల భూమి అవసరం. ఇందు 114 హెక్టార్ల భూమి ప్రభుత్వ భూమి కాగా, 1297 హెక్టార్ల భూమి తెలంగాణలోని ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, చింతకాని, కొనిజర్ల, తల్లాడా, వైరా,వేంసూర్ మండలాల, ఆంధ్రప్రదేశ్ లోని చింతలపూడి, టి.నర్సాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి మండలాల రైతులనుండి సేకరించనున్నారు.
2. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం లో ఖమ్మం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్, 9 మేజర్ బ్రిడ్జ్ లు, 51 మైనర్ బ్రిడ్జెలు నిర్మిస్తారు. ఈ రహదారి 5 నదులు, 15 కాలువలను క్రాస్ చేస్తుంది.
3. ఈ ప్రాజెక్ట్ వల్ల 36 కట్టడాలు, 2446 చెట్లు తొలగించవల్సి ఉన్నది.
4. ఈ ప్రాజెక్ట్ మొత్తం విలువ 4609 కోట్లు కాగా, ఇందు 3239 కోట్లు రోడ్డు నిర్మాణానికి కాగా, మిగిలిన సొమ్ము భూసేకర కొరకు కేటాయించారు.
5. ఈ ప్రాజెక్ట్ కొరకు 70 మీటర్ల వెడల్పున భూమి సేకరించి అందు 4 లైన్ల రహదారి నిర్మిస్తారు.
6. ఈ రహదారి నిర్మాణాన్ని మొత్తం 5 భాగాలుగా విభజించారు. 3 భాగాలు తెలంగాణలోనూ, 2 భాగాలు ఆంద్రప్రదేశ్ లోను నిర్మిస్తారు.
7. పశ్చిమగోదావరి లో 2 విభాగాలుగా రోడ్ నిర్మాణం జరుగుతుంది. కి.మీ. 89 నుండి 162 కి.మీ వరకు 73 కి.మీ రోడ్ నిర్మిస్తారు. ఇందు రేచెర్ల నుండి జంగారెడ్డిగూడెం వరకు 4 వ ఫేజ్, జంగారెడ్డిగూడెం నుండి దేవరపల్లి 5 వ ఫేజ్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఈ రెండు ఫేజ్ ల నిర్మాణానికి పూణే కు చెందిన బెకం ఇన్ఫ్రా సంస్థ 1000 కోట్లతో బిడ్లు దక్కించుకున్నది.
పశ్చిమగోదావరి లో భూ సేకరణకు నోటిఫికేషన్.
ఖమ్మం – దేవరపల్లి జాతీయరహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మే నెల 28 , 2021 నాడు గెజట్టే పబ్లికేషన్స్ ఇచ్చింది. ఈ పబ్లికేషన్స్ ద్వారా చింతలపూడి మండలం లోని ఎండవల్లి, గణిజేర్ల, లింగాయిగూడెం,రాఘవపురం,రేచెర్ల, శెట్టివారిగూడెం,తీగలవంచ, వెంకటాద్రిగూడెం, టి. నర్సాపురం మండలం లోని టి.నర్సాపురం, గురువైగూడెం, ఎపుకుంట, తిరుమలదేవిపేట, వల్లంపట్ల, జంగారెడ్డిగూడెం మండలం లోని దేవులపల్లి, లక్కవరం, తిరుమలపురం,కేతవరం, కొయ్యలగూడెం మండలం లోని అయిదు వాడ పాలెం, పొంగు టూరు, దేవరపల్లి మండలంలోని యాదవోలు, దేవరపల్లి రెవిన్యూ గ్రామాలలో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ లో సూచించిన సర్వే నెంబర్ లో గల భూమి యజమానులు ఏమైన అభ్యంతరం ఉంటే 21 రోజులలోగా పశ్చిమ గోదావరి జాయింట్ కలెక్టర్ ని సంప్రదించి వారి అభ్యంతరం తెలియ చెయ్యాల్సి ఉంది. ఈ భూసేకర పూర్తి కాగానే ఈ వర్షా కాలం తర్వాత పనులు ప్రారంభించడానికి బెకం ఇన్ఫ్రా ప్రయత్నాలు మొదలు పెట్టింది..
అనుకున్న ప్రకారం 2020 లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయితే 2023 కు పూర్తి కావాల్సి ఉంది. కరోన నేపథ్యంలో ఆలస్యం కావడంతో 2025 కు పూర్తి చేయాలన్న సంకల్పం తో కేంద్రం ఉంది….