అసైన్డ్ భూముల్లో దందాలు చేసుకుంటూ.. కోట్లకు పడగలెత్తిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఎవరూ కాపాడలేరు అని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. టీఆర్ఎస్ఎల్పీలో గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడారు. అసైన్డ్ భూములు లాక్కున్నారని ఫిర్యాదులు చేసిన వారిని ఈటల భయభ్రాంతులకు గురి చేశారు. పేదలను పూర్తి స్థాయిలో వాడుకొని, వారిపైనే నిందలు మోపుతున్నారు. ఇవన్నీ గ్రహించిన తర్వాతే సీఎం చర్యలకు పూనుకున్నారు. ఇప్పటి నుంచి ఎక్కడ మాట్లాడినా భూముల విషయాలు ప్రస్తావించాలి. కానీ ఆత్మగౌరవం కాదు. ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టిన ఈటల ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత కోల్పోయాడని పేర్కొన్నారు.
అసైన్డ్ భూములను కొనే చట్టం ఉంటే అది చూపించండి. మా ఆస్తుల గ్రాఫ్‌లు తగ్గిపోతున్నాయి. కానీ ఈటల ఆస్తుల గ్రాఫ్ మాత్రం అమాంతం పెరిగిపోతోంది. సందర్భం వచ్చినప్పుడు తమకు పెద్ద అన్న అని చెప్పి.. ఇప్పుడేమో నియంత అని మాట్లాడుతున్నారు. ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ పార్టీ ఎంతో గౌరవం ఇచ్చిందన్నారు. ఢిల్లీలో ఉన్న వారు కాపాడుతారు అని ఈటల భావిస్తున్నారు. ఆయన చేసిన పాపాలను చట్టం గమనిస్తుందన్నారు. ఈటల రాజేందర్‌ను ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి కాపాడలేరు.
సీఎం కేసీఆర్ వల్లే ఈటల ఎమ్మెల్యే అయ్యారు. కచ్చితంగా హుజురాబాద్‌లో టీఆర్ఎస్సే గెలుస్తుందన్నారు. మతాలు, కులాల పేరిట ఓటర్లను విభజించి ఎమ్మెల్యేగా గెలవాలనుకుంటే అది సాధ్యం కాదన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్య పెట్టదు అని స్పష్టం చేశారు. అభివృద్ధి విషయంలో అన్ని నియోజకవర్గాలను సీఎం కేసీఆర్ సమదృష్టితో చూస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఏ ఒక్క రోజు కూడా ఇతర నియోజకవర్గాల్లో పర్యటించలేదు. మంత్రిగా చేయాల్సింది మరిచిపోయి, బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోలేదు అని గువ్వల బాలరాజు ధ్వజమెత్తారు