ఐదేండ్ల క్రితమే ప్రగతిభవన్ వేదికగా తనకు అవమానం జరిగిందని చెప్తున్న ఈటల ఆనాడే ఎందుకు రాజీనామా చేయలేదని మంత్రి కొప్పుల ప్రశ్నించారు. అవమానం జరిగిన చోట ఉండనని పదేపదే చెప్తున్న ఈటల.. అదే పార్టీ బీఫారంపై ఎందుకు పోటీ చేశారు? తిరిగి మళ్లీ మంత్రివర్గంలో ఎందుకు చేరారు? ప్రభుత్వ నిర్ణయాల్లో ఎందుకు భాగస్వాములు అయ్యారు? అని నిలదీశారు. ప్రగతిభవన్ బానిస భవన్ అయిందని అంటున్న ఈటల ఇన్నాళ్లు అక్కడ జరిగిన సమావేశాలకు ఎందుకు హాజరయ్యారని ప్రశ్నించారు.
దేశానికి దిక్సూచిగా ఎన్నో పథకాలకు వేదికగా నిలిచిన ఆ భవన్‌లో జరిగిన ప్రతి సమావేశంలో మీరు భాగస్వాములు ఆయ్యారు కదా.. అప్పుడు గుర్తుకురాని బానిస భవన్ ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నదని నిలదీశారు. బెంజ్ కార్లలో తిరిగే వారికి రైతుబంధు వర్తింప చేయవద్దని చెప్పానంటున్న మాజీమంత్రి, బెంజ్‌కార్లలో తిరుగుతున్న మీ కుటుంబ సభ్యులు ఏటా రూ.10.24 లక్షల రైతుబంధు డబ్బులను ఎందుకు తీసుకుంటున్నారో సమాధానంచెప్పాలని డిమాండ్‌చేశారు.
బడుగులపై ప్రేమ ఉంటే.. వారి నుంచి చట్టవిరుద్ధంగా కొనుగోలు చేసిన భూములను వారికి తిరిగి ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలను చేసిందని, అవి నల్లచట్టాలని వాటిని రద్దుచేసే వరకు పోరాడుతామని చెప్పిన ఈటల అదే పార్టీలో ప్రస్తుతం కలుస్తున్నారు కదా? ఇది ఆత్మగౌరవమా.. లేక ఆత్మవంచనా చెప్పాలన్నారు. మంత్రులకు స్వేచ్ఛ లేదంటూ మీ అభిప్రాయాన్ని ఇతర మంత్రులకు రుద్దాలని చూడవద్దని సూచించారు.