తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీలో ఉన్నట్లే బీజేపీలో కూడా గ్రూపులు ఉన్నాయన్నారు. అయితే ఈటలతోపాటు కొందరు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పార్టీలో చోటులేదన్నారు.
చేరికలను వ్యతిరేకిస్తే వాళ్లకే నష్టమని రాజాసింగ్ అన్నారు. ఈటల బీజేపీలోకివస్తే పార్టీలో ఉన్న కొంతమంది వీడతారనే వార్తలు వచ్చాయన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ ఎవరి సొంతంకాదని, పార్టీలో చేరికలపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
రాష్ట్రంలో బీజేపీ బలపడాలని అధిష్టానం కృషి చేస్తోందని.. ఈ నేపథ్యంలో ఈటల పార్టీలోకి వస్తే బీజేపీకి మంచిజరుగుతుందని, రాష్ట్రంలో పార్టీ బలపడుతుందని రాజాసింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈటల బీసీలో ఉన్న బలమైన వ్యక్తి అని, అలాంటి వ్యక్తి పార్టీలోకి వస్తే బాగుంటుందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.