అది బాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన టాలీవుడ్ అయిన చిత్రసీమలో కథానాయికల మధ్య పోటీ ఉంటుందనే సిద్ధాంతాన్ని తాను విశ్వసించనని అంటోంది అంజలి. సహనాయికల్ని చూసి స్ఫూర్తిపొందుతానే తప్ప వారి పట్ల తనలో ఎలాంటి అసూయద్వేషాలుండవని చెబుతోంది. నవతరం నాయికలతో పోటీవల్లే అంజలి అవకాశాల రేసులో వెనుకబడిపోయినట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.
ఆ వార్తలను అంజలి ఖండిచింది. ఇండస్ట్రీలో ఉన్న ఇతర నాయికల్ని పోటీగా తానేప్పుడూ భావించుకోనని అంటోంది. అంజలి మాట్లాడుతూ ‘సినీపరిశ్రమలో అవకాశాల విషయంలో ప్రతిభ ఒక్కటే కొలమానంగా ఉంటుంది. ఇక్కడ ఎవరికి దక్కాల్సిన సినిమాలు వారినే వరిస్తాయి. ఇతరులు చేస్తోన్న మంచి పాత్రలు నాకు దక్కితే బాగుంటుందని ఆశపడటంలో అర్థంలేదు.
రాసిపెట్టుంటే తప్పకుండా ఆ అవకాశం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. నా సినీ ప్రయాణంలో అనుష్క, సమంతతో పాటు చాలా మంది నాయికలతో కలిసి నటించాను. వారిని నా స్నేహితులుగా భావించాను తప్పితే పోటీదారులుగా ఏనాడూ ఊహించలేదు. సీనియర్లతో పాటు నూతన హీరోయిన్ల నటనను చూస్తూ నాలోని తప్పుల్ని సరిదిద్దుకుంటా. నాయికల మధ్య పోటీ గురించి అడిగితే మౌనమే నా సమాధానంగా భావిస్తా’ అని చెప్పింది.