మహమ్మారి కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీపై కూడా గట్టిగానో ఉంది. ఎక్కడి షూటింగ్స్ అక్కడ ఆగిపోవడంతో సినీ కార్మికులు ఎందరో అల్లాడిపోతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు ‘కె.జి.యఫ్’ స్టార్ యష్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
కన్నడ సినీ పరిశ్రమలోని 21 డిపార్ట్‌మెంట్స్‌లో ఉన్న 3వేల మంది సభ్యులకు.. ఒక్కొక్కరికి రూ. 5000 చొప్పున ఆర్ధిక సహాయం అందించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా యష్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. ‘‘కొవిడ్ 19 అనే కనిపించని శత్రువు.. ప్రజల ప్రాణాలను బలిగొంటూ.. వారికి జీవనోపాధి లేకుండా చేస్తుంది.
నా సొంత కన్నడ సినీ పరిశ్రమ కూడా ఈ మహమ్మారికి ప్రభావితమైంది. ఈ క్లిష్ట సమయంలో ఇండస్ట్రీలోని 21 విభాగాలలో ఇబ్బందులు పడుతున్న 3000 మంది సభ్యులకు.. నా సంపాదన నుంచి.. ఒక్కొక్కరికి రూ. 5000 చొప్పున వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు పంపిస్తున్నాను. ఈ సాయం వారి కష్టాలనన్నింటినీ తీర్చలేదని తెలుసు.. కానీ ఎంతో కొంత ఊరటనిస్తుంది. మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ఉందాం..’’ అని యష్ తన ట్వీట్‌లో తెలిపారు.