ఈ 2021 ఏడాది ముగిసేలోపు దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పూర్తి వ్యాక్సినేషన్ కాదు కదా.. కేంద్రం చెప్పిన సమయానికి అందరికీ కనీసం తొలి డోసు వ్యాక్సిన్ ఇవ్వడం కూడా కుదరదని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది. దేశంలో 18 ఏళ్లు నిండిన వాళ్లు 94.4 కోట్ల మంది ఉన్నారు. అందులో ఇప్పటి వరకూ తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 16.7 కోట్లు మాత్రమే.
ప్రస్తుతం ఇస్తున్న వేగంతోనే మిగతా వాళ్లందరికీ తొలి డోసు వ్యాక్సిన్ ఇవ్వాలంటే కనీసం 256 రోజులు పడుతుందని ది హిందూ పత్రిక రిపోర్టు వెల్లడించింది. అంటే 8 నెలలపైనే. గత వారం దేశంలో రోజుకు సగటున 30 లక్షల వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. అంతకుముందు 45 రోజుల పాటు అయితే రోజుకు 20 లక్షలు కూడా దాటలేదు. ఒకవేళ ఇప్పుడిస్తున్నట్లుగా రోజుకు 30 లక్షల డోసులు ఇచ్చినా కూడా అందరికీ తొలి డోసు ఇవ్వడానికి 8 నెలలకుపైనే పట్టనుంది.
వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచడం అనేది ప్రజల ఆరోగ్యానికి కాదు ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కేవీ సుబ్రమణియన్ అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల సంఖ్య పెరిగినా.. అవి తీసుకునే వారి సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. జూన్‌లో 12 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. మేలో వీటి సంఖ్య 7.94 కోట్లుగానే ఉంది.