ఏపీలో కరోనా మహమ్మారికి విరుగుడుగా నెల్లూరు ఆనందయ్య ఇస్తున్న మందులకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కళ్లలో వేసే డ్రాప్స్ తప్ప మిగితా అన్ని మందులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రాలేదని, అవి వచ్చాక ఆ మందుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెప్తోంది.
అలాగే ‘కె’ అనే మందును కమిటీ ముందు చూపించకపోవడంతో దానికి కూడా అనుమతి నిరాకరించింది. ఇక ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల ఎలాంటి హాని లేదని సీసీఆర్ఏఎస్ నివేదిక తేల్చడంతో ప్రభుత్వం వాటికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కంట్లో వేసే డ్రాప్స్ విషయంలో పూర్తి నివేదికలు రావడానికి మరో 2–3 వారాల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.