రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. చనిపోయాడని ఓ వ్యక్తికి అంత్య క్రియలు నిర్వహిస్తే వారం తర్వాత ఆ వ్యక్తి ఇంటికి వచ్చిన ఘటన తాజాగా బయటపడింది. రాజ్‌సమంద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వ దవాఖాన ఆర్కే హాస్పిటల్‌లో మరణించిన గోవర్దన్ ప్రజాపతి మ్రుతదేహాన్ని పొరపాటున ఓంకార్ లాల్ గడులియా బంధువులు తీసుకెళ్లారని విచారణలో తేలింది. వారిద్దరూ అదే దవాఖానలో చికిత్స పొందారు.
అసలు కథేమిటంటే ఓంకార్ లాల్ గడూలియా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులకు చెప్పకుండానే ఈ నెల 11న ఉదయ్‌పూర్‌కు వెళ్లాడు. లివర్ సంబంధ ఆరోగ్య సమస్యతో ఒక దవాఖానకు వెళ్లాడు.
అదే రోజు గోవర్దన్ ప్రజాపత్ చికిత్స కోసం ఆర్కే హాస్పిటల్‌లో చేరాడు. కానీ తర్వాత మరణించాడు. కానీ, మ్రుతదేహం కుడి చేయి చూసి గోవర్దన్‌ను గడూలియాగా పొరపాటుగా గుర్తించారు. పోలీసులు కూడా పోస్ట్‌మార్టం, డీఎన్ఏ పరీక్ష నిర్వహించకుండానే మ్రుతదేహాన్ని అప్పగించారు.
అప్పటికే కుళ్లిపోయిన దశలో ఉన్న గడూలియా మ్రుతదేహానికి ఈ నెల 15న ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ ఈ నెల 23న గడూలియా ఇంటికి రావడంతో అంతా షాక్‌కు గురయ్యారు.
దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోవర్దన్ ప్రజాపత్ మ్రుత దేహానికి గడూలియా కుటుంబం అంత్యక్రియలు నిర్వహించిందని నిర్దారించారు.
నర్సింగ్, మార్చురీ సిబ్బంది వల్లే పొరపాటు జరిగిందని దవాఖాన అధికారులు అంగీకరించారు. ఈ ఘటనపై చర్య తీసుకుంటామని దవాఖాన మెడికల్ ఆఫీసర్ లలిత్ పురోహిత్ చెప్పారు.