కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 28 నుంచి సూపర్ స్ప్రెడర్స్‌కు కొవిడ్ టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ముందుగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఆటో డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, హోటల్స్, సెలూన్ల సిబ్బంది, కూరగాయల వ్యాపారులు, కిరాణా దుకాణదారులు, హమాలీలకు టీకాలు వేయాలని నిర్ణయించింది.
ఈ క్రమంలోనే కొవిడ్ వ్యాక్సినేషన్‌పై మంత్రి హరీష్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సూపర్ స్ర్పెడర్లకు టీకాలు వేసే విషయంపై సమావేశంలో చర్చించారు. సూపర్ స్ర్పెడర్ల గుర్తింపు, అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు.
తాత్కాలిక సచివాలయం బీఆర్‌కే భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ సెక్రటరీ రిజ్వి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ, ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఎంఆర్ఎం రావు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావుతో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు.
ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసే వారు, రేషన్ దుకాణాల డీలర్లు, పెట్రోల్ పంప్ వర్కర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లలో ఉండే వర్తకులు, కూరగాయలు, పండ్లు, పూలు అమ్ముకునే వారు, నాన్ వెజ్ మార్కెట్లు, కిరాణా దుకాణాల వారికి, మద్యం దుకాణాల వారికి టీకా కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు.
వైరస్‌ను వ్యాపింపజేసే అవకాశమున్న సూపర్ స్ప్రెడర్లను గుర్తించి వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని.. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని మంత్రి హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే