తెలంగాణలోని ఎస్టీ విద్యార్థుల ఉన్నత విద్య కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీంను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అర్హులైన ఎస్టీ విద్యార్థుల నుంచి ఎస్టీ సంక్షేమ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్యానిధి కోసం దరఖాస్తునకు జూన్ 15వ తేదీ వరకు గడువు విధించారు.
అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ. 5 లక్షలకు మించరాదు. విద్యార్థుల వయసు 2021, జులై 1వ తేదీ నాటికి 35 సంవత్సరాలు మించరాదు.
యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ర్టేలియా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా దేశాల్లోని యూనివర్సిటీల్లో ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 20 లక్షలు సాయం చేయనున్నది. దరఖాస్తు కోసం సంప్రదించాల్సిన వెబ్‌సైట్ telanganaepass.cgg.gov.in.