పెళ్ళిచూపులు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల చూపులను తనవైపు తిప్పుకొన్నది హీరోయిన్ రీతూవర్మ. మొదటి మిస్ హైదరాబాద్ పోటీలో రన్నరప్‌గా నిలిచిన ఈ భామ అందంతో, అభినయంతో టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్‌లోనూ మంచిపేరు సంపాదించుకుంది. ఇప్పుడు ‘టక్ జగదీష్’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతున్నది. రీతూ తత్త్వమే అంత. కథల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తుంది. సినిమాల సంఖ్య లెక్కేసుకోకుండా ప్రాధాన్యమున్న పాత్రల్నే ఎంచుకుంటుంది. కాబట్టే, సమ్‌థింగ్ స్పెషల్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపును సాధించుకొన్నది. 2011లో ప్రారంభమైన ‘మిస్ హైదరాబాద్’ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన రీతూ ‘అనుకోకుండా..’ అనే షార్ట్‌ఫిల్మ్‌తో, అనుకోకుండానే సినీ కెరీర్‌ను ప్రారంభించింది. తరుణ్‌భాస్కర్ ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్.
రీతు పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే అయినా, మధ్యప్రదేశ్‌కు చెందిన కుటుంబం. తండ్రి బిజినెస్‌మ్యాన్, తల్లి స్కూల్ ప్రిన్సిపల్. మొత్తంగా, సినీరంగంతో ఎటువంటి సంబంధం లేని కుటుంబం. ఇంజినీరింగ్ తర్వాత మోడలింగ్ చేస్తూ అందాల పోటీల్లోకూడా పాల్గొన్నది. అప్పుడే ‘అనుకోకుండా..’ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని కెమెరా ముందుకొచ్చింది.
నటించిన ఫస్ట్ షార్ట్‌ఫిల్మ్‌కే ఉత్తమనటి అవార్డును సొంతం చేసుకున్న రీతూను అవకాశాలు పలుకరించాయి. ‘బాద్‌షా’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించినా ‘నా రాకుమారుడు’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో మంచి
నటిగా మార్కులు కొట్టేసి, ‘పెళ్ళిచూపులు’తో అందరి దృష్టినీ ఆకర్షించింది.
కెరీర్ తొలినాళ్ళలోనే కథా ప్రాధాన్యమున్న సినిమాలను, మనసుకు నచ్చిన కథలనే ఎంచుకొంటానని ప్రకటించి ‘ఔరా’ అనిపించుకుంది. ‘కేశవ’ తర్వాత వరుస అవకాశాలు రావడంతో కోలీవుడ్‌లో పాగా వేసిన రీతూ ఏకంగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో, అదీ విక్రమ్ పక్కన ‘ధ్రువ నక్షత్రం’లో ఛాన్స్ కొట్టేసింది.
దుల్కర్ సల్మాన్ జంటగా చేసిన ‘కనులు కనులను దోచాయంటే’ అటు తమిళంలో, ఇటు తెలుగులో రీతూకు మంచి పేరు తెచ్చి పెట్టింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తనలోని ప్రతిభను ప్రేక్షకులకు పరిచయం చేసిందీ భామ. రెండేండ్ల తర్వాత నాని జంటగా ‘టక్ జగదీష్’తో మరోసారి టాలీవుడ్‌ను పలుకరిస్తున్నది రీతూ వర్మ.
కొంచెం గ్యాప్ తీసుకున్నా ఈ సంవత్సరం టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టుల్లో మెరువనున్నది రీతూ. రవితేజ ‘కిలాడీ’తోపాటు శర్వానంద్, నాగశౌర్యలతో మరో రెండు సినిమాలకు సైన్ చేసింది. తమిళంలో అశోక్ సెల్వన్ సినిమాలోనూ నటిస్తున్నది. అమెజాన్ ప్రైమ్‌లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్‌లో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
‘లాక్‌డౌన్‌లో షూటింగ్స్ ఆగిపోయి కాస్త గ్యాప్ వచ్చింది. పెన్సిల్ ఆర్ట్ అంటే నాకు చిన్నప్పటినుంచీ ఇష్టం. దొరికిన టైమ్‌ను ఆర్ట్ ప్రాక్టీస్‌కు వినియోగించాను. ఈ సంవత్సరం తెలుగులో నాలుగు ప్రాజెక్టులు సైన్ చేశా. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దశలో మంచిరోజులొస్తాయి. నాకు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి’ అని తన ఆనందాన్ని పంచుకుంది రీతూ. ఈ హైదరాబాదీ అందాల నాయిక మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించాలని కోరుకుందాం.