అప్పట్లో రక్తం దొరక్క ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో 1998 చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌ను ప్రారంభించారు.
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి అందిన రక్తంతో ఎంతోమంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఇప్పుడాయన మరో సంకల్పానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దేశవాప్తంగా కరోనా బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు. మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది.
దీనికి కొంత కారణం ఆక్సిజన్ కొరత. దాని వల్ల ఎవరూ మరణించకూడదనే ఆలోచనతో ఆయన ఆక్సిజన్ బ్యాంక్‌ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలోనూ నెలకొల్పాలని సంకల్పించారు. మరో వారం రోజుల్లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులోకి వస్తుందని రామ్‌చరణ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
కార్యక్రమాలన్నీ రామ్‌చరణ్ మానిటర్ చేస్తారని, మెగా అభిమానులు కూడా దీనిలో భాగస్వాములు కానున్నారని చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. దీని కోసం ఓ ట్విట్టర్ ఖాతాను కూడా ప్రారంభించారు.