ప్రపంచంలో భారత ప్రధాని నరేంద్రమోదీ రేటింగ్ క్రమంగా పడిపోతూ వస్తున్నది. దేశం యావత్తూ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు విలవిల్లాడుతున్న తరుణంలో గ్లోబల్ లీడర్‌గా ప్రధాని మోదీ రేటింగ్ అత్యంత కనిష్టానికి పడిపోయింది. ఈ విషయాన్ని ఆమెరికాకు చెందిన ఒక సర్వే సంస్థ తన నివేదిక స్పష్టం చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సైతం భారీ మెజారిటీతో విజయం సాధించారు.
గత మూడు దశాబ్దాల్లో ఏ ఇండియన్ లీడర్‌కు సాధ్యం కానీ మెజారిటీని ప్రధాని నరేంద్రమోదీ సుసాధ్యం చేశారు. దాంతో బలమైన జాతీయస్థాయి నాయకుడిగా ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు దేశంలో కరోనా కేసుల సంఖ్య 2.5 కోట్లు దాటడం ఆయన ప్రతిష్టను మసకబారేలా చేసింది. కరోనా కట్టడి కోసం సన్నద్ధమవడంలో మోదీ ప్రభుత్వం విఫలం కావడంవల్లే మహమ్మారి వేగంగా విస్తరించిందని విమర్శలు వెల్లువెతున్నాయి.
అమెరికాకు చెందిన డాటా ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్స్ ప్రపంచస్థాయి నేతల పాపులారిటీని నిరంతరం ట్రాక్ చేస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు వెల్లడిస్తుంటుంది. ఆ సంస్థ తాజాగా ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఈ వారం ప్రధాని మోదీ ఓవరాల్ రేటింగ్ 63 శాతానికి పడిపోయింది. 2019, ఆగస్టులో తాము ప్రధాని మోదీ పాపులారిటీని ట్రాక్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే అత్యంత కనిష్ట రేటింగ్ అని ఆమెరికా రేటింగ్ సంస్థ తెలిపింది