తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎక్కడ ఏం చేపట్టాలి అన్నది సీఎం కేసీఆర్‌కు ముందే అవగాహన ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరంటు, సాగునీటితో కేసీఆర్ గారు తెలంగాణ వ్యవసాయ రంగ స్వరూపం మార్చారన్నారు.
తెలంగాణ నవ నిర్మాణం గురించి కేసీఆర్ 2001 లోనే స్పష్టమైన ప్రణాళిక నిర్దేశించుకున్నారని, ఆకలి చావుల తెలంగాణను ఏడేళ్లలో కేసీఆర్ అన్నపూర్ణగా మార్చారన్నారు.
అత్యద్భుత పారిశ్రామిక విధానంతో తెలంగాణ దేశానికే పరిశ్రమలకు అడ్డాగా మారిందన్నారు. ఐటీ, ఉత్పత్తి, సేవా రంగాలలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు.
వైద్యం పూర్తిగా ప్రభుత్వ పరిధిలో ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన.. దానిని దృష్టిలో ఉంచుకునే కేసీఆర్ ఆదిలాబాద్, మహబూబ్ నగర్, సూర్యాపేట, సిద్దిపేటలలో నూతన వైద్య కళాశాలలు ప్రారంభించారన్నారు.
కొత్తగా వనపర్తితో కలిపి ఆరు మెడికల్ కళాశాలలు, దాంతో పాటు నర్సింగ్ కళాశాలలు మంజూరు చేయడం దేశానికే ఆదర్శమన్నారు. వనపర్తిలో మెడికల్ కళాశాలతో దక్షిణ పాలమూరు జిల్లాకు వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
2018 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.