అన్ని ప్రైవేట్ దవాఖానాల్లో 20 శాతం పడగలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వీటిలో పేదలకు కరోనా వైద్య సేవలు అందించేందుకు వినియోగిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రైవేట్ దవాఖానలలో కరోనా రోగుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేటు దవాఖానలో కొవిడ్ ట్రీట్మెంట్ కోసం పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నారని రోగి బంధువులు కేటీఆర్ కు ట్వీట్ చేశారు.
దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్‌లో పరిస్థితిపై సమీక్షించమని.. మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ కు ట్విట్టర్ ద్వారా సమాచారం అందించారు. స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంటనే మహబూబ్ నగర్ చేరుకుని ప్రైవేటు దవాఖానాల్లో వైద్యం అందుతున్న తీరు, ఫీజుల వసూళ్లపై రోగుల బంధువులతో మాట్లాడారు. భూత్పూర్ మండల కేంద్రంలోని పంచవటి హాస్పిటల్లో కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసిన రోగి బంధువులతో మాట్లాడారు
అక్కడ అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. కరోనా వార్డు, రోగులకు అందిస్తున్న చికిత్స, పరీక్షలు, బిల్లులు తనిఖీ చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో హైదరాబాద్ స్థాయిలో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
ఉమ్మడి జిల్లా లో ఎక్కడా లేని విధంగా జనరల్ దవాఖానలో 500 ఆక్సిజన్ పడకలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రైవేటు దవాఖానాల్లో పేదల నుంచి భారీగా ఫీజులు వసూలు చేయవద్దని మానవత్వంతో స్పందించి తక్కువ ఖర్చుతో వైద్య సహాయం అందించాలని మంత్రి సూచించారు.
ప్రభుత్వ జనరల్ దవాఖానలో పైసా ఖర్చు లేకుండా అత్యాధునిక వైద్య సదుపాయం అందిస్తున్నామని, రెమెడిసివిర్, ఆక్సిజన్, వెంటిలేటర్ పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జనరల్ ఆసుపత్రి తర్వాత ఎస్వీఎస్ మెడికల్ కళాశాల దవాఖాన లోనూ 350 పడకలతో తక్కువ ఖర్చుతో వైద్య సదుపాయం అందిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు.
ట్విట్టర్లో ఫిర్యాదు వస్తే పంచవటి దవాఖాన లో తనిఖీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.
ఫిర్యాదు చేసిన రోగి బంధువులతో మాట్లాడమని వైద్యం బాగా అందుతోందని చెప్పారని మంత్రి అన్నారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కృష్ణ, మున్సిపల్ చైర్మన్ కెసి నర్సింహులు ఉన్నారు.