కేంద్రంలో పలు దఫాలుగా మంత్రిగా పనిచేసిన రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షులు చౌదరి అజిత్ సింగ్ మృతితో తెలంగాణ ఒక ఆత్మీయున్ని కోల్పోయిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ అన్నారు. అజిత్‌సింగ్ మరణంపై వినోద్‌కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి అండగా నిలిచిన అజిత్ సింగ్ ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు, తనకు అత్యంత సన్నిహితులన్నారు.
మాజీ ఉప ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజన కోసం హరిత ప్రదేశ్ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించిన ఘనులన్నారు. అజిత్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్(82) కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22న ఆయన కరోనా బారినపడ్డారు. అప్పటినుంచి గురుగ్రామ్‌లోని మేదాంత దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే ఊపిరితిత్తులలో ఇన్‌ఫెక్షన్ కారణంగా మంగళవారం రాత్రి ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున తుది శ్వాసవిడిచారు