నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో కారు జోరు మీదుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ భారీగా మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉండగా, బీజేపీ అడ్రస్ గల్లంతు అయింది. ప్రతీ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ పార్టీ మంచి ఆధిక్యాన్ని కనబరుస్తోంది. పన్నెండో రౌండ్ ముగిసే సరికి 10,361 ఓట్ల మెజార్టీతో నోముల భగత్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చాయి.
తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 3,854, కాంగ్రెస్‌కు 3113 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోలయ్యాయి. నాలుగో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 4,186 ఓట్లు, కాంగ్రెస్ కు 3,202 ఓట్లు వచ్చాయి. ఐదో రౌండ్‌టో టీఆర్ఎస్‌కు 3,442, కాంగ్రెస్ కు 2676, బీజేపీకి 74 ఓట్లు పోలయ్యాయి. ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3,989, కాంగ్రెస్ పార్టీకి 3,049 ఓట్లు వచ్చాయి.
ఏడో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 4,022, కాంగ్రెస్ పార్టీకి 2,607 ఓట్లు వచ్చాయి. ఎనిమిది రౌండ్లో టీఆర్ఎస్‌కు 3, 249, కాంగ్రెస్ పార్టీకి 1,893 ఓట్లు పోలయ్యాయి. తొమ్మిదో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 2,205, కాంగ్రెస్‌కు 2,042 ఓట్లు, పదో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 2,991, కాంగ్రెస్‌కు 3,166 ఓట్లు రాగా, పదకొండో రౌండ్‌లో టీఆర్ఎస్ కు 3,395, కాంగ్రెస్ పార్టీకి 2,225 ఓట్లు వచ్చాయి. పన్నెండో రౌండ్‌లో టీఆర్ఎస్ కు 3833, కాంగ్రెస్ కు 2578 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబుళ్లపై లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో 25 రౌండ్లలో లెక్కింపు పూర్తికానుంది. సాయంత్రం ఏడు గంటల వరకు అధికారికంగా విజేతను ప్రకటించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా కొవిడ్ నిబంధనల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులతో సహా పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. కౌంటింగ్‌లో 400 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.