పోలింగ్ శాతం ఎంత పెరిగితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట 23వ వార్డులోని 69వ బూత్‌లో హరీశ్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారులు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారని వెల్లడించారు. ఓటర్లు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరు ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. అభివృద్ధికి పట్టం కట్టాలని, మంచి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
సిద్దిపేట మున్సిపాలిటీలో 43 వార్డులకు పోలింగ్ జరుగుతున్నది. మొత్తం 236 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 1,00,678 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నిక అధికారులు 130 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.