తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి కలిసి టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహం, ఆచార్య జయశంకర్ విగ్రహానికి కేకే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతరం కే కేశవరావు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అకుంఠిత కార్యదీక్షతో గాంధేయ మార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు అని పేర్కొన్నారు. కేసీఆర్ పట్టువీడని ఉక్కు సంకల్పం, కార్యదీక్ష, మొక్కవోని ధైర్యంతోనే తెలంగాణ సాధ్యమైందన్నారు. తెలంగాణ రాష్ర్ట సాధనతో కార్య సాధన పూర్తి కాలేదన్నారు. బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు.